తృణమూల్‌ రెబెల్‌ ఎంపీల్లో యుసుఫ్‌ పఠాన్‌, శతృఘ్న సిన్హా?

  • టీఎంసీలో ముదిరిన తీవ్ర రాజకీయ సంక్షోభం
  • 19 మంది ఎంపీల తిరుగుబాటు బావుటా
  • యూసుఫ్‌ పఠాన్, శతృఘ్న సిన్హా ఉన్నట్లు సమాచారం
  • ఎన్డీయే కూటమికి మద్దతిచ్చే యోచనలో ఎంపీలు
  • మమతా బెనర్జీ తగ్గక తప్పని పరిస్థితి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 19 మంది లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల జాబితాలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా, సాయోని ఘోష్ వంటి కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభలో తృణమూల్‌కు 28 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 19 మంది అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక వర్గానికి కేవలం 9 మంది ఎంపీల మద్దతు మాత్రమే మిగిలింది.

ఈ తిరుగుబాటు ఎంపీలు ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయకూడదని, అలాగే నేరుగా బీజేపీలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి వీరు ఈ వ్యూహాన్ని సిద్ధం చేశారు. లోక్‌సభలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి, కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌డీయే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయాలని ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని అసమ్మతి వర్గం భావిస్తోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగిలిన కొన్ని రోజులకే ఎంపీల తిరుగుబాటు వెలుగుచూసింది. ఇటీవల అసెంబ్లీలో పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 58 మంది ఎమ్మెల్యేలు సొంత నిర్ణయం తీసుకున్నారు.  పార్టీలో తలెత్తిన ఈ తీవ్ర అల్లకల్లోలం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఆమె కాస్త వెనక్కి తగ్గి ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరై ప్రతిపక్షాలతో సయోధ్యను ప్రదర్శించారు.

Yusuf Pathan
Shatrughan Sinha
Trinamool Congress
Mamata Banerjee
West Bengal Politics
TMC MP Revolt

More Telugu News